Extracted Text
తెలంగాణకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. ఐటీ ఏరియాలో భూమి అంటే బంగారం కంటే ఎక్కువేవని తాజాగా రాయదుర్గంలో నిర్వహించిన ఈ-వేలంలో తేలింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) రాయదుర్గంలో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా రూ. 264 కోట్లు పలికి సరికొత్త రికార్డును సృష్టించింది. మొత్తం 5.25 ఎకరాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఒక్కరోజులో రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తాను చాటింది. గతంలో రాయదుర్గంలో ఎకరా రూ. 237 కోట్లు పలికింది. ఈసారి ఆ ధర దాటి కనక వర్షం కురిసింది.
నోటిఫికేషన్ విడుదల
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కూడా భారీ ఆశలు పెట్టుకుంది. రాయదుర్గం బాటలోనే కాసుల వర్షం ఖాయమని అంటున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న ప్లాట్లు, ఓపెన్ ల్యాండ్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మోకిలలో 95 ప్లాట్లు (చదరపు గజానికి రూ. 55 వేలు కనీస ధర), బాచుపల్లిలో 35 ప్లాట్లు (చదరపు గజానికి కనీస ధర రూ. 45 వేలు), ఇస్నూల్ నేచర్ లేఅవుట్లో 60 ప్లాట్లు (కనీస ధర రూ. 15 వేలు)గా పేర్కొంది. ఇస్నూల్ నేచర్లో మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కనీస ధర నిర్ణయించారు. ఇక గండిపేట్, చందానగర్, నాగోలు, సూరారం, కాప్రా, నియోపోలిస్, సరూర్ నగర్ లోని ఖాళీ స్థలాల వేలానికి సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఓపెన్ ల్యాండ్స్ కు ఈ నెల 24వ తేదీన వేలం నిర్వహించనున్నారు. ప్లాట్లకు సెప్టెంబరు 2, 3, 7, 9 తేదీల్లో ఈ-వేలం ప్రక్రియ జరగనుంది.
కోకాపేట్ చాటేనా సత్తా...
గతంలో కోకాపేటలో ప్లాట్ నంబరు 17లో మొత్తం 4.59 ఎకరాలను వేలం నిర్వహించారు. దీనిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరా రూ. 136 కోట్లకు దక్కించుకున్నా.. సకాలంలో వాయిదాలు చెల్లింపు చేయలేక డిఫాల్టర్గా మిగిలింది. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న హెచ్‌ఎండీఏ తాజాగా మరోసారి అదే ప్లాట్‌ను వేలంలో పెట్టింది. రాయదుర్గం మాదిరిగానే ఇక్కడా భారీ ధర వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్లాట్‌లో ఎకరా కనీస ధర ఎకరాకు రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో ఎకరాకు రూ. 150 కోట్లు ధర అంచనా వేసినా... మొత్తం భూమికి రూ. 688 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. కోకాపేటలో గోల్డెన్ మైల్ లేఅవుట్లోనూ 0.70 ఎకరాలు వేలానికి పెట్టి.. ఎకరా కనీస ధర రూ. 70 కోట్లుగా నిర్ణయించింది. గతంలో కోకాపేట భూముల అమ్మకం ద్వారా హెచ్‌ఎండీఏ ఖజానా కళకళలాడింది. నియోపోలిస్ లేఅవుట్ లో ప్లాట్ నంబరు 15 (మొత్తం 4.03 ఎకరాలు) ఈ-వేలంలో ఎకరాకు అత్యధికంగా రూ. 151.25 కోట్లు ధర పలికింది. ఇక్కడే 16 ప్లాట్‌లో ఎకరాకు రూ. 147.75 కోట్లకు అమ్ముడుపోయింది. గతంలో ఒక్క నియోపోలిస్ లో విడతలవారీగా వేసిన వేలం ద్వారా రూ. 3 వేల కోట్లు ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మల్టీజోన్, అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), స్కైస్క్రాపర్లు, వాణిజ్య హబ్ లు నిర్మించుకోవడానికి అనువైన నిబంధనలతోడు.. ఐటీ కారిడార్ కావడం, జాతీయ అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారడంతో ఇక్కడ భూములకు భారీగా డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఐటీ కారిడార్, ఔటర్ రింగ్ రోడ్డు, విమానాశ్రయానికి నేరుగా అనుసంధానం ఉండటంతో ఒక్కో ఎకరా రూ. వందల కోట్లు పలుకుతున్నాయి. ఈసారి కూడా ప్లాట్లు, భూముల వేలం ద్వారా రూ. 2 వేల కోట్లు నుంచి రూ. 3 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరనుందని హెచ్‌ఎండీఏ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్లు, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులు చేపడుతోంది. మెట్రో రైల్ రెండో దశ, మూసీ ప్రక్షాళన వంటి వాటికి నిధుల అవసరం ఉంది. భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ప్రాజెక్టులకు నిధుల సమస్య తీరనుంది.