News

వేగంగా బెంగుళూరు జాతీయ రహదారి NH-44 విస్తరణ పనులు

బెంగుళూరు జాతీయ రహదారి 44 విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల మార్గాన్ని ఆరు లైన్లకు విస్తరించి డి పి ఆర్ సిద్ధమైంది. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు వరకు 576 కిలోమీటర్ల రహదారి విస్తరణకు గత ఏడాది జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే రెండువైపులా ఏడు మీటర్ల మీద సర్వీసు రోడ్లు నిర్మించనున్నారు. తెలంగాణలో 190 కిలోమీటర్లు, ఆంధ్ర ప్రదేశ్ లో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల మేరా ఈ మార్గం ఉంది. విస్తరణకు తెలంగాణ పరిధిలో రూ. 4,550 కోట్లు, మొత్తంగా రూ. 16,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లడానికి ప్రస్తుతం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుంది. విస్తరణ ద్వారా ప్రయాణ సమయాన్ని రెండు గంటలైనా తగ్గించాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలో విస్తరణ పై డిపిఆర్ తయారీకి జనవరిలో కన్సల్టెన్సీని నియమించారు. ఐదున్నర నెలల కసరత్తు తర్వాత డిపిఆర్ సిద్ధమైంది. అధికారుల పరిశీలన అనంతరం ఈ నెలాఖరులోగా కేంద్రానికి పంపనున్నారు. విస్తరణకు అవసరమైన భూమిని గతంలోని సేకరించారు. దీంతో  ఏడాదిన్నరలో పనులు పూర్తి చేయవచ్చని అంచనా. అక్టోబర్లో పనులు చేపట్టేందుకు వీలుగా టెండర్లు ఆహ్వానించే అవకాశం ఉంది. ప్రతి 10 నుండి 15 కిలోమీటర్లకు ఒకచోట డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి వెళ్లే దారిలో ట్రాఫిక్ జాములు ఇతర అవాంతరాలపై సమాచారాన్ని, అందుబాటులో సేవలను ప్రదర్శిస్తూ ఈ మార్గాన్ని సూపర్ ఇన్ఫర్మేషన్ హైవేగా రూపొందించనున్నారు.

admin